March 1, 2026

TDPనుంచి ఎన్ని పార్టీలు పుట్టాయో తెలుసా?

దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ -TDP ఓ సంచలనం. ప్రజాభిమానం ఉన్న నాయకుడు పార్టీ పెడితే జాతీయ పార్టీలకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలిపిన సాక్ష్యం కూడా. నాలుగు దశాబ్దాల చరిత్రలో ఆ పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. ప్రతిసారి పార్టీ పని అయిపోయింది అని వైరి పక్షాలు ప్రచారం చేసినా మళ్లీ నిలదొక్కుకుని అధికారంలోకి వస్తూనే ఉంది. ఆ పార్టీకి నాయకత్వం కంటే కూడా చెక్కు చెదరని కేడరే ప్రధాన బలం. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రభావం కోల్పోయింది. రానున్న కాలంలో తెలంగాణలో ఆ పార్టీ మనుగడ కష్టమే అనే చర్చకూడా ఉంది. ఇదంతా ప్రస్తుత పరిస్థితి అయితే ఒక జాతీయ పార్టీ స్థాయిలో తెలుగుదేశం పార్టీనుంచి కూడా అనేక పార్టీలు పుట్టాయి. సంచలనాలు రేపాయి. కొన్ని కనుమరుగయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.

నందమూరి తారకరామరావుగారు #ntr  స్థాపించిన తెలుగుదేశం పార్టీ 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఇక ఎన్టీఆర్ -Nandamuri Taraka Rama Rao గారు ఉన్నప్పుడు చాలామంది నేతలు ఎన్టీఆర్ గారితో విభేదించి బయటకు వచ్చి వేర్వేరు పార్టీలో చేరారు.

 

కాని తెలంగాణ దిగ్గజ నేతల్లో ఒకరైన కుందూరు జానా రెడ్డి గతంలో ఉమ్మడి ఏపీ హోమంత్రిగా, హౌసింగ్ మినిస్టర్ గా చేశారు. అయితే ఆయన రాజకీయ జీవితం టీడీపీతో మొదలైంది. అప్పట్లో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలతో విభేదించి బయటకు వచ్చారు. 1988లో తెలుగు మహానాడు పేరుతో పార్టీని నడిపారు. కొన్ని రోజులకే ఆ పార్టీని నడపడంలో ఇబ్బందులు వచ్చాయి. దీంతో రాజీవ్ గాంధీ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.అప్పటినుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీనుంచి బయటకు వచ్చిన నాయకుడు ఏర్పాటు చేసిన తొలి పార్టీ ఇదే. అయితే తెలుగుదేశం పార్టీ ప్లీనరీగా చెప్పే కార్యక్రమం కూడా మహానాడు పేరుతోనే నడుస్తోంది.

నందమూరి తారకరామారావుగారి మరణం తరువాత లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు. అప్పటికే ఎన్టీఆర్ గారు టీడీపీనుంచి బయటకు వచ్చారు. ఎన్టీఆర్ గారి మరణం తరవాత తెలుగుదేశం పార్టీ గుర్తు కోసం లక్ష్మీ పార్వతి న్యాయపోరాటం చేసి విఫలం అయ్యారు. ఇక ఎన్టీఆర్ గారు చనిపోయిన తరవాత 1996 ఉప ఎన్నికల్లో లక్ష్మీ పార్వతి పాతపట్నం నుంచి పోటీ చేసిన గెలిచారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్లిన లక్ష్మీ పార్వతిని తిరస్కరించారు ప్రజలు. 1999 ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఒక్కసీటు గెలుచుకోకపోగా పోటీచేసిన అన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయింది. ఆ తరువాత ఆ పార్టీ కనుమరుగైంది. లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు.

ఇక ఎన్టీఆర్ గారు చనిపోయిన తరువాత కొన్నాళ్లపాటు చంద్రబాబుగారితోనే ఉన్న నందమూరి హరిక్రిష్ణ గారు చంద్రబాబుతో విభేదాలల కారణంగా 1999  జనవరి 26న  అన్న తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ పార్టీ ఎన్నికల్లో దారుణంగా విఫలమైంది. ఎన్టీఆర్ కు సారథిగా వ్యవహరించిన హరిక్రిష్ణకు ప్రజల్లో భారీ మద్దతు కనిపించినా ఆ పార్టీ కేవలం 1. 1 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. 191 సీట్లలో పోటీ చేసినా ఒక్కచోట కూడా డిపాజిట్ రాలేదు. చివరికి 2006లో ఆ పార్టీని టీడీపీలో విలీనం చేశారు.

ఇక తెలుగుదేశం పార్టీనుంచి విడిపోయి పార్టీలు పెట్టి సక్సెస్ అయిన ఏకైక వ్యక్తి కేసీఆర్ మాత్రమే. దాదాపు 20ఏళ్లపాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న కేసీఆర్ చంద్రబాబు మంత్రివర్గంలో రవాణా మంత్రిగా చేశారు. 2001లో ఆయనను డిప్యూటీ స్పీకర్ గా నియమించారు చంద్రబాబు. అయితే తెలంగాణ నినాదంతో టీడీపీనుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఉద్యమాన్ని నడిపించారు. తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంతో 2014, 2018లో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో టైగర్ నరేంద్ర స్థాపించిన తెలంగాణ సాధన సమితి,  విజయశాంతి పెట్టిన తల్లి తెలంగాన పార్టీ విలీనం అయ్యాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది.

ఇక ముదిరాజ్ వర్గానికి చెందిన కీలక నేత కాసాని జ్ఞానేశ్వర్ కూడా 2007లో టీడీపీనుంచి పూర్తిగా బయటకు వచ్చారు. అప్పటివరకు అంశాల వారీగా టీడీపీతో ఉండేవారు. అయితే 2007లో బయటకు వచ్చి మన పార్టీ పేరుతో పార్టీ పెట్టారు. అయితే రాజకీయంగా ఆయనకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తరువాతి కాలంలో ఆయన టీడీపీలో చేరగా, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరారు.

2008లో టీడీపీలో కీలక నేత, ఉమ్మడి ఏపీ హోమంత్రిగా, టీడీపీలో దాదాపు నెం.2 స్థానంలో ఉన్న తూళ్ల దేవేందర్ గౌడ్  తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పార్టీనీ వీడారు. నవ తెలంగాణ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే కొన్నాళ్లకే అంటే 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకోగా ఆ తరువాత ప్రజారాజ్యంలో విలీనం చేశారు. ప్రజారాజ్యం పార్టీ తరపున మల్కాజ్ గిరి ఎంపీగా, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యేగా పోటీ చేసిన దేవందర్ గౌడ్ రెండు చోట్లా ఓడిపోయారు. ఇక 2009 ఆగస్టు 3న ప్రజారాజ్యం పార్టీని వీడి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. 2012 నుంచి 2018 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

2009లో నాగం జనార్దన్ రెడ్డి టీడీపీనుంచి బయటకు వచ్చి తెలంగాణ నగారా పార్టీ పెట్టారు. ఆ తరువాత పార్టీని రద్దు చేసి బీజేపీలో చేరారు. 2018లో కాంగ్రెస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ లో చేరారు. ఆ తరవాత రాజకీయాలకు దాదాపు దూరంగా ఉన్నారు.

ఇవీ TDP పార్టీనుంచి పురుడు పోసుకున్న పార్టీలకు సంబంధించిన అంశాలు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *