మూసీ (Musi River) ప్రక్షాళన చేపట్టింది రేవంత్ (Revanth reddy) ప్రభుత్వం. గుజరాత్ (Gujrat) లోని సబర్మతి (Sabarmati) నది ప్రక్షాళన జరిగినట్లుగానే మూసీ ప్రక్షాళన చేస్తున్నామని చెబుతోంది. అయితే సబర్మతి ప్రక్షాళన విషయంలో ఏం జరిగిందో చూద్దాం.
నదుల ప్రక్షాళనలో దేశ వ్యాప్తంగా అందరి ద్రుష్టి ఆకర్షించింది సబర్మతి నది. సబర్మతి ఆశ్రమానికి దాదాపుగా ఆనుకుని ఉండే ఈ నది ఒకప్పుడు అహ్మదాబాద్ కు తాగునీరు అందించింది. అయితే కాల క్రమంలో చెత్త చెదారంతో నిండిపోయింది. రాజస్థాన్ లో పుట్టినా గుజరాత్ మీదుగా అరేబియాలో కలుస్తుంది. దీనిపై ఐదు రిజర్వాయర్లుకూడా ఉన్నాయి.
ఈ నది అహ్మదాబాద్ లో 22 కి.మీ దూరం ప్రవహిస్తుంది. ఈ నదీ తీరంలో ఆక్రమణలు, వీక్లీ మార్కెట్ల ఏర్పాటు, అనధికారిక నిర్మాణాలు, డంపింగ్ యార్డుల కారణంగా కాలుష్య నదిగా మారింది. దీంతో 1960ల నుంచి సబర్మతి నదిని పరిరక్షించాలనే డిమాండ్ వచ్చింది.
1960లోనే ఇందుకోసం దాదాపు 74 ఎకరాల భూసేకరణ జరిగింది. ఆ తరువాత ప్రభుత్వాలు మారడంతో మళ్లీ ఆక్రమణలు జరిగాయి. దీంతో 1998లో అహ్మదాబాద్ (Ahmedabad) మున్సిపల్ కార్పొరేషన్, గుజరాత్ ప్రభుత్వం రూ. కోటి తో సబర్మతి రివర్ ప్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. భూ సేకరణ, ఆక్రమణల తొలగింపు తదితర అంశాల్లో పలు వివాదాలు తలెత్తాయి. కోర్టుల్లో కేసూ వేశారు. అవన్నీ 2004కి కొలిక్కి వచ్చాయి.
2004లో దాదాపు రూ. 1300 కోట్ల బడ్జెట్ తో పనులు ప్రారంభించింది ఆనాటి ప్రభుత్వం. రెండు వైపులా కలిపి 500 ఎకరాల్లో ఉన్న ఆక్రమణలు తొలగించారు. 500 ఎకరాల భూముల్లో ఆక్రమణలు తొలగించారు. దాదాపు 12వేల ఇళ్లను, 8వేల దుకాణాలను, కమర్షియల్ షెడ్లను, 3 మార్కెట్లను తొలగించింది. తొలగించిన ఇండ్లకు బదులుగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఇళ్లు కేటాయించింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం. ఇందుకోసం రూ. 444 కోట్లు ఇచ్చింది. 2014నాటికి నదిని శుధ్ది చేసే ప్రక్రియ (Sabarmati Riverfront) పూర్తయింది.

ఈ విషయంలో ప్రజలనుంచి సహకారం అందింది. 2009లో ఒక్కరోజే లక్ష మంది స్వచ్చందంగా చెత్తను తొలగించేందుకు ముందుకొచ్చారు. 975 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారు. 11వేల టన్నుల ఇతర చెత్తను తొలగించారు. ఆధునిక సీనరేజ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. ఒడ్డున ఉన్న చెత్త కుప్పలను తొలగించి, రీసైక్లింగ్ యూనిట్లను స్థాపించారు. ప్రక్షాళనలో వాకింగ్ ట్రాక్ లు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్షాళన తరువాత 130 పక్షుల జాతులు ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక నర్మదా (Narmada) కెనాల్ ద్వారా నిరంతరం ఈ నదిలో నీరు ప్రవహించేలా ఏర్పాటు చేశారు. 2014 నాటికి పాక్షికంగా పనులు పూర్తి కాగా, 2020నాటికి సంపూర్ణంగా పూర్తయ్యాయి.

ప్రస్తుతం అహ్లదకరంగా మారిన ఈ నదిని గతంలో చైనా (China) సుప్రీం జిన్ పింగ్ (Xi Jinping) ఫ్యామిలీతో కలిసి సందర్శించారు.
ఒకప్పుడు నడవడానికి కూడా భయపడే నది ఒడ్డు, ఇప్పుడు నడక దారులు, ఆట స్థలాలతో నిండిపోయింది. ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు రెండు దశాబ్దాల సమయం పట్టింది, కానీ ప్రతి అడుగూ విలువైనదిగా మారింది.
ఈ తరహాలోనే ఇప్పుడు తాజాగా రేవంత్ సర్కార్ మూసీ ప్రక్షాళన చేపట్టింది. కార్యాచరణ కూడా ప్రకటించింది. ఒక వేల సబర్మతి నదీ తరహాలనే మూసీ నది ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ చరిత్రే మారిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రాజెక్టుగా నిలుస్తుంది.

