నాలుగురోజులనుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
మేడారం (Medaram) జాతరలో కోవా బన్ (Kova Bun)అమ్మే వ్యక్తిని పట్టుకుని కొందరు యూట్యూబర్లు ప్రశ్నించారు. అతనితో కోవా బన్ తినిపించారు.

విషయం ఏంటంటే..ఆ కోవా బన్ లో అతను ఏదో కలిపాడని సదరు యూబ్యూబర్ కు డౌటనుమానం.
అతను ఏం కలిపాడో ఎవరికీ తెలియదు కాబట్టి అతని చేత (అమ్మే వ్యక్తి చేతే) తినిపించారు.
ఆయన చిరు వ్యాపారి. కర్నూలు నుంచి పొట్ట చేతబట్టుకుని మేడారం జాతరకు కోవా బన్ లు అమ్ముకునేందుకు వచ్చాడు. అతను కోవా బన్ ని తయారు చేయడు. కేవలం అమ్ముతాడు.
అయితే నిజంగానే ఆ కోవా బన్ లో ఏదో కలిపితే ఆధారాలతో సహా పట్టుకోవచ్చు. అధికారులను రప్పించి తనిఖీలు చేయించవచ్చు.
కాని వీడియో తీసి మరీ స్పాట్ ఇంటరాగేష్ చేసినట్టు చేశారు. ఆ వీడియోలో ఆ కోవా బన్ – Kova Bun అమ్మే వ్యక్తిని చూసిన ప్రతి ఒక్కరు చలించిపోయారు.
నిజంగానే ప్రస్తుతం కొన్ని ఆహారపదార్ధాల్లో కొందరు ఉమ్మివేసి అమ్ముతున్నారు. ఒకడు మురుగునీరు కలుపుతాడు. ఇంకొకడు కుళ్లిపోయిన వాటితో జ్యూస్ చేస్తాడు. ఇంకొకడు మరీ ఛండాలంగా చేస్తాడు. ఇలాంటి చాలానే బయటపడ్డాయి. అది కాదనలేం.
ఇక పెద్ద పెద్ద హోటల్స్ లో అయితే పురుగులనే బిర్యానీలో వేసి వడ్డిస్తారు. వాటిని చాలామంది లొట్టలేసుకుంటూ తింటారు. మరికొందరు అడిగితే వారు దాడి చేస్తారు. అది కూడా మనం చూస్తున్నాం.
కాని ఇతను అంత పెద్ద వ్యక్తి కాదు. కాలే కడుపు చేత పట్టుకుని..భార్య పిల్లలకు పట్టెడన్నం పెట్టేందుకు వచ్చాడు. అంత నిలదీస్తున్నా కుటుంబ బాధ్యతల కారణంగా మిన్నకుండిపోయాడు. గొంతులోనుంచి దుఃఖం తన్నుకొస్తున్నా పంటిబిగువన అదిమిపట్టి బన్ తిన్నాడు.
అయితే ముందుగా చెప్పిన కోణంలో చూసినా.. ఆధారాలతో సహా పట్టుకున్నప్పుడే ఉపయోగం. కాని కేవలం ఒక కోవా బన్ అమ్ముకునే వ్యక్తిని చూపిస్తూ, చుట్టూ పదిమందిని పోగేసి, ఒక్కడిని చేసి మరీ సివిల్ ఇంటరాగేషన్ చేయడం హేయకరమే.
మరో దయనీయమైన విషయం ఏంటంటే.. సదరు హైక్వాలిఫైడ్, హై క్వాలిటీ ఫ్రొఫెషన్ , ఇంటర్నేషనల్, హైస్టాండర్ట్, మల్టీనేషనల్ ,మల్టీ లాంగ్వేజ్, ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్ట్ అడిగిన ప్రతి ప్రశ్నకు అతను సమాధానం ఇస్తూనే ఉన్నాడు. తన పిల్లలకు కూడా పెడుతాను అని చెప్పాడు.
భార్యా బిడ్డలకు తిండి పెట్టేందుకు అతడు చూపించిన ఓర్పు, నేర్పు, అతను పడుతున్న కష్టంలో ఈసమెత్తైనా సదరు జర్నలిస్టు మిత్రుడికి/మిత్రురాలికి లేకపోవడం బాధాకరమే.
అందుకే ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. నిజంగానే దమ్ముంటే అవి తయారు చేసేటప్పుడో, కల్తీ చేసేటప్పుడో పట్టుకోవాలి. ప్రశ్నించాలి. చట్టానికి అప్పజెప్పాలి. అది నిజమైన దమ్ము అంటే.
ఇక కొన్ని పేరు మోసిన బ్రాండ్ లు కూడా కల్తీ అవుతున్నాయి. వాటిపై పోరాడాలి.
పొట్ట చేతబట్టుకుని తనది కాని మతం వారు చేసుకుంటున్న వేడుకకు కోవా బన్ అమ్మేందుకు వచ్చాడంటే కనీసం అతను పడుతున్న శ్రమను చూడాలికదా.. ఆలోచించాలి కదా అనే కామెంట్లు వస్తున్నాయి.
అందుకే అతి సర్వత్ర వర్జయేత్. టీఆర్పీల కోసం, రేటింగ్స్ కోసం, వ్యూస్ కోసం పాకులాడి తమను తాము దిగజార్చుకోవడంతోపాటు జర్నలిజాన్ని మరింత దిగజార్చడం అంటే ఇదే.
Medaram Jathara Kova Bun Viral Issue
