February 27, 2026

లబ్సాతో భోలే బాబా లంబా..లంబా..

వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే అంశంపై జరుగుతున్న రచ్చ కొత్తగా చెప్పాల్సిన అంశమేమీ కాదు. రాజకీయంగా కూడా ఇది దుమారం రేపుతోంది. అయితే ఈ అంశంపై విచారణ జరిపిన సిట్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ఒకటి నెయ్యిగా కనిపించే పదార్థం తయారీలో లబ్సా అనే ప్రమాకరమైన యాసిడ్ మిశ్రమం వాడి తయారు చేశారనేది ప్రధానమైన అంశం.

సిట్ నివేదికలో..

‘చుక్క పాలు సేకరించకుండా భోలేబాబా (Bhole Baba Dairy) డెయిరీ నెయ్యిని సరఫరా చేసింది. శ్రీవారి లడ్డూ -Tirumala Laddu ప్రసాద తయారీకి నెయ్యి Tirumala laddu prasadam-Ghee లాంటి మిశ్రమాన్ని తయారు చేసేందుకు 57.56 లక్షల కిలోల పామాయిల్, పామ్‌కెర్నెల్‌ ఆయిల్‌తో పాటు 8.90 లక్షల కిలోల మోనోగ్లైసెరైడ్స్‌ లబ్సా, ఎసిటిక్‌ యాసిడ్‌ ఈస్టర్, లాక్టిక్‌ యాసిడ్‌ ఫుడ్‌గ్రేడ్ తదితర రసాయనాలు కొన్నారు. ఆ మిశ్రమాన్నే తిరుమల -tirumala శ్రీ వారి లడ్డూ సరఫరాకు వాడింది.’ అని సిట్ (SIT) నివేదిక ఇచ్చింది.

అసలు ఏంటి ఈ లబ్సా..

లబ్సా అనేది అతి ప్రమాదకరమైన రసాయనం. ఇది యాసిడ్ తో కూడిన మిశ్రమం. దీని పూర్తి పేరు లీనియర్‌ ఆల్కైల్‌ బెంజీన్‌ సల్ఫోనిక్‌ యాసిడ్‌ (Linear Alkylbenzene Sulfonic Acid – LABSA). డొమెస్టిక్ మార్కెట్లో ప్రధానంగా ఆయిల్ ను క్లీన్ చేయడానికి, వాషింగ్ పౌడర్ల తయారీకి, స్ట్రెయిన్స్ రిమూవర్ల తయారీకి, డిష్ వాష్ లిక్విడ్ లో, ఫ్లోర్ క్లీనర్లలో, టాయిలెట్ క్లీనర్లలో వాడుతుంటారు.

ఇళ్లల్లో మనం వాడే హార్పిక్, లైజోల్, సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ లాంటి వాటిలోనూ ఈ మిశ్రమం ఉంటుంది. దానికి డైరెక్ట్ గా పేరు వాడకుండా సాంకేతిక కోడ్ వాడుతారు. మొత్తంమీద వాష్ రూం క్లీనింగ్ నుంచి బట్టల క్లీనింగ్ వరకు దీన్ని వాడుతారు.

పారిశ్రామికంగా..

పారిశ్రామికంగా చాలా చోట్ల వినియోగిస్తారు. ఇది పురుగుమందుల కంటే ప్రమాదకరమైన రసాయనం కూడా. కంపెనీల్లో ముఖ్యంగా ఆయిల్ కంపెనీలు, నూనె ఆధారిత కంపెనీల్లో ఎక్కువగా వాడతారు. ఆయిల్‌ అండ్‌ పెట్రో కెమికల్స్‌ రంగంలో రిఫైనరీల్లోని ట్యాంకులను క్లీనింగ్ గ్ చేసేందుకు, చమురు బావుల్లో ఉండే మెషినరీ క్లినింగ్ కి, డ్రిల్లింగ్ ఫ్లూయిడ్స్ లో వాడతారు.

 

వస్త్ర పరిశ్రమలో ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ లో భాగంగా శుభ్రం చేసేందుకు, క్లీనింగ్, వెట్టింగ్‌ ఏజెంట్‌గా వినియోగిస్తారు.

 

ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఆయిల్ మరకలను, గ్రీజు మరకలను తొలగించేందుకు నీటిలో నిర్ణీత పాళ్లలో కలిసి వినియోగిస్తారు.

 

ఇక హైజెనిక్ గా ఉండాల్సిన కొన్ని ప్రదేశాలు అంటే రీసెర్చ్ ల్యాబ్ ల పరిసరాల్లో లేదా విత్తన శుద్ది ప్రక్రియలోనూ క్రిమి సంహారిణిగా వాడతారు. అంటే ఎమల్సిఫయర్‌గా దీన్ని వాడతారు.

పూర్తి నిషేధిత పదార్థంగా..

ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం ఇలాంటి వాటిని ఆహార పదార్థాల తయారీలో ఎలాంటి మోతాదులోనూ, ఏ రూపంలోనూ వాడకూడదని నిషేధం ఉంది. అలాంటి ప్రమాదకర రసాయనాన్ని నెయ్యి లాంటి పదార్థం తయారుచేసేందుకు వాడారనేది ప్రధాన అభియోగం.

ఆరోగ్యంపై ప్రభావం ఇదీ

లబ్సా ఏ రూపంలో వినియోగించినా, ఎంత డైల్యూట్ చేసి తీసుకున్నా ప్రమాదకరమే. ఇది ఏ రూపంలో మనం తీసుకున్నా జీర్ణ ప్రక్రియనుంచి మొదలు, లివర్, కిడ్నీలు, లంగ్స్, పేగులు దెబ్బతింటాయి. పేగులకు పుండ్లు పడే ప్రమాదం ఉంటుంది. ఇక అల్సర్ కి కారణం అవుతుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్‌ వంటి రోగాలు వచ్చే ప్రమాదముంది. ఈ రసాయనం గాలి తగిలితే కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీన్ని వినియోగించాలంటే ముందుగా సేఫ్టీ ప్రధానమని ఆ రసాయన తీయారీ కంపెనీలు తాటికాయంత అక్షరాలతో ముద్రిస్తాయి. ఇక అస్తిపంజరం, పుర్రె బొమ్మ కూడా ఈ డబ్బాలపై కనిపిస్తుంది.

లబ్సానే ఎందుకు వాడారు..

అయితే ఇతర మిశ్రమాలకంటే లబ్సా ఎందుకు తెరపైకి వచ్చిందనేది మరో ప్రధానమై అంశం. కల్తీ నెయ్యి తయారీదారులు పామాయిల్, పామ్‌కెర్నెల్‌ ఆయిల్‌ లాంటి నాసిరకం నూనెలు వడతారు. అయితే బోలే బాబా డెయిరీ ఇచ్చిన మిశ్రమం అచ్చం నెయ్యిలా కనిపించేందుకు అంటే రంగుతోపాటు వాసన వచ్చేందుకు, నెయ్యిలా జారిపోయే స్వభావం వచ్చేందుకు లబ్సాను, లాక్టిక్ యాసిడ్ తో కలిపారు.  అచ్చం నెయ్యి (Ghee) అనిపించేలా తయారు చేశారు.

సిట్ నివేదిక అంశాలు ఎలా ఉన్నా.. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో ప్రమాదకర రసాయనం కలిపినా, జంతువుల కొవ్వు వాడినా ఘోరమైన తప్పిదమే అవుతుంది.

 

చివరగా ఈ అంశంలో  చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఒక వేళ తప్పు జరిగి ఉంటే కచ్చితమైన శిక్ష పడాలి. రాజకీయాలకు అతీతంగా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.

 

                                                  ఓం నమో వెంకటేశాయ నమః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *