కంటికి రెప్పలా పిల్లల్ని కాపాడాల్సిన వ్యక్తి ఎన్నికల పిచ్చితో కాలయముడయ్యాడు. అభం..శుభం తెలియని ఆరేళ్ల కుమార్తెను బలి తీసుకున్నాడు. ఎన్నికలకు అడ్డం వస్తుందనే ఉద్దేశంతో కాలువలోకి తోసేశాడు. పోలీసులు ఆ కేసును ఛేదించడంతో కటకటాల పాలయ్యాడు.
మహారాష్ట్రలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సాధారణంగానే పట్టుదలలు, పట్టింపులు ఉంటాయి. ఇక ఈ ఎన్నికలకు సంతానానికి సంబంధించిన నిబంధన కూడా ఉంది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అయితే ముగ్గురు పిల్లలున్న తండ్రి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక కుమార్తెను చంపేశాడు.
మహారాష్ట్రలోని ముఖేడ్ తాలూకా కేరూర్ గ్రామానికి చెందిన పాండురంగ బాబు కొండ్ మంగళే వచ్చే జూన్ లో జరిగే ఎన్నికల్లో పోటీ సిద్ధం అయ్యాడు. అతడికి ముగ్గురు పిల్లలు. కుమారుడు మొదటి సంతానం కాగా మరోసారి కవల కుమార్తెలు పుట్టారు. దీంతో పోటీకి అనర్హుడిని అవుతాడని భావించాడు.
వాస్తవానికి మహారాష్ట్రం పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న నిబంధనలు ముగ్గురు సంతానం విడివిడిగా ఉంటేనే ఈ నిబంధన వర్తిస్తుంది. అంటే ఒక సంతానం సింగిల్ గా పుట్టి, రెండో డెలివరీలో కవలలు పుడితే, ఆ మేరకు కవలలు పుట్టారని నిరూపించుకుంటే పోటీ చేయవచ్చు. కాని అలా నిరూపించుకునేందుకు పాండురంగ బాబు దగ్గర ఎలాంటి సర్టిఫికెట్లు లేవు. ఇన్ స్టంట్ గా పోటీకి లైన్ క్లియర్ కావాలి అనుకున్నాడు.

ఇదే విషయాన్ని ప్రస్తుత సర్పంచ్ గణేష్ షిండేకి చెప్పడంతో అతను ఒక పిల్లను వదిలించుకోవాలని చెప్పాడు. అతని దృష్టి ఆరేళ్ల పాప ప్రాచి మీద పడింది. ప్రాచీని ఎవరైనా దత్తత తీసుకుంటారేమోనని ప్రయత్నించాడు. కాని దత్తత తీసుకునేందుకు చాలా రూల్స్ ఉండడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. దీంతో గణేష్ తో కలిసి ప్లాన్ చేశాడు.
తన ఊరునుంచి పాపకు మాయ మాటలు చెప్పి బైక్ పై ఎక్కించుకుని నిజామాబాద్ జిల్లా యడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ వద్దకు బైక్ పై వచ్చి నిజాంసాగర్ కెనాల్ లో పాప గొంతు నులిపి తోసేశాడు. ఏమీ ఎరుగనట్టు ఊరికి వెల్లిపోయాడు.
ఇక నాలుగు రోజుల కిందట.. నిజాంసాగర్ కెనాల్‌లో ఓ బాలిక డెడ్ బాడీ కనిపించింది. పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో ఆ బాలికను కొందరు గుర్తు పట్టి పోలీసులకు వివరాలు చెప్పారు.
ఆ సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరిపారు. నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే కొన్ని అనుమానాలు వచ్చాయి. దీంతో పాండురంగ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పాడు. దీంతో పాండు రంగతోపాటు గణేష్ షిండేను అదుపులోకి తీసుకున్నారు. వారు వాడిన బైక్ ను, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరి న్యాయస్థానం ఇతనికి ఏ శిక్ష వేస్తుందో చూడాలి.
ఇక ఐదేళ్ల పదవి కోసం కుమార్తెను చంపిన కిరాతకుడి గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
