కుట్రలు ఉంటాయి..రెచ్చగొట్టే ధోరణులు ఉంటాయి.. వాటిని విస్మరించకుండా కఠినంగా నియంత్రిస్తూనే ప్రభుత్వాన్ని నడపాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఏపీ టీడీపీ నాయకులు. ఎందుకంటే 2017 తరువాత ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు అదే పరిస్థితిని తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ మొదలైంది.

పార్టీలోని సీనియర్ నాయకులు చెబుతున్న అంశాలు ఇవీ..
2014లో ఏపీలో ఎన్డీయే కూటమి-టీడీపీ అధికారంలోకి వచ్చింది. రెండేళ్ల తరువాత అంటే 2016లో కుట్రలు మొదలయ్యాయి. రెచ్చగొట్టే ధోరణులూ పెరిగాయి. అమరావతి భూ సేకరణ అంశం మొదలు ప్రతి అంశంలోనూ రచ్చ మొదలైంది. ఈ లోగా కుల కుంపట్లు మొదలయ్యాయి. ప్రత్యేక హోదా, ప్యాకేజీల అంశాల కారణంగా ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అయింది. ఫలితంగా బీజేపీతో దూరం పెరిగింది. ఇందుకు బీహార్ వాసి నడిపిన పొలిటికల్ మేనేజ్మెంట్ టీం తమ పాత్ర పోషించింది. ఇక కాపు ఉద్యమం పేరుతో సరికొత్త రాజకీయ అంశం తెరపైకి వచ్చింది. అంటే ప్రభుత్వంపై నిత్యం విషం జిమ్మే కార్యక్రమం మొదలైంది. ఆ ఫలితమే తుని ఘటన.
ఇవన్నీ ముందుగానే ఆనాడు చంద్రబాబుకు కొందరు నేతలు చెప్పినా తాను డెవపల్మెంట్ చేస్తున్నాను కాబట్టి ప్రజలు తనవైపే ఉన్నారని భావించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కుట్రలు ఏం చేస్తాయిలే అని భావించారు. తీరా 2019లో పార్టీ 23 సీట్లకు పరిమితమైంది. అగ్రనాయకులు బాగానే ఉన్నారు. కాని ఇబ్బంది పడింది మాత్రం కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తలే. ఆ కులం..ఈ కులం అనే తేడా లేకుండా వారిపై దాడులు జరిగాయి. కేడర్ చాలా కోల్పోయింది. అన్ని కులాల కార్యకర్తలూ వేధింపులకు గురయ్యారు. కాని పార్టీని వదులుకోలేదు. మళ్లీ తెలుగుదేశం జెండాను రెపరెపలాడేలా చేశారు. 
ఇప్పుడు మళ్లీ..
2019నుంచి ఎన్నో ఒడిదొడులకు ఎదుర్కొంది టీడీపీ. వీరికి జనసేన, బీజేపీ తోడయ్యాయి. దీంతో 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీ తరపున అవే కుట్రలు మొదలయ్యాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ముద్రగడ పద్మనాభరెడ్డి గారిలాంటి అతి పెద్ద రెడ్లకు సామాజిక వర్గాల అంశం ఓ ఆయుధంగా మారుతుంది. జనం నేతల్లో విష బీజం నాటేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాల్లో ముఖ్యంగా జనసేనకు-టీడీపీకి మధ్య గ్యాప్ పెంచేందుకు ఏ చిన్న అవకాశాన్ని వైరి పక్షాలు వదులుకునేలా లేవు. ఇందుకు వ్యక్తిగతంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తారు. తాము ఏమైనా చేయవచ్చు..ఎంతకైనా మాట్లాడొచ్చు.. కాని తమపై చర్యలు తీసుకుంటే కులాన్ని తెరపైకి తెస్తారు.
ఇక టీడీపీ కేడర్ ఏ మాత్రం రియాక్ట్ అయినా చంద్రబాబును, లోకేష్ ను టార్గెట్ చేస్తారు. తద్వారా ప్రజలను గందరగోళానికి గురిచేసేలా చేస్తారు. ఈ క్రమంలోనే టీడీపీలో ఉండే అసమ్మతి నాయకులు, నాయకులు అప్పుడప్పుడు మాట్లాడిన మాటలను పార్టీ మొత్తానికి ఆపాదించి చంద్రబాబుకు తెలిసే అన్నీ జరుగుతాయనే కథలు అల్లుతారు. ఇవన్నీ చంద్రబాబు లాంటి నాయకుడి ఊహకు అందనివి కావు. డీల్ చేయడం కూడా పెద్ద విషయం కాదు.
అసలైన సమస్యే ఇదే..
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి అధికార పక్ష దాడులకు గురైన వారిని, పార్టీ కోసం అన్నీ వదులుకుని కష్టపడిన క్షేత్రస్థాయి కేడర్ ను కొందరు నాయకులు పట్టించుకోకపోవడమే ఇప్పుడు అసలైన సమస్య. 2019-2024 మధ్య కొందరు కార్యకర్తలు చాలా పోగొట్టుకున్నారు. అలాంటివారికి అండగా నిలవాల్సిన కొందరు నాయకులు, అధికారంలోకి రాగానే అహం తలెక్కి వ్యవరిస్తున్నారు. అందుకే ఇటీవలి కాలంలో టీడీపీ సోషల్ మీడియాలో చురుకుదనం తగ్గింది. ఈ పరిస్థితి గమనించకుండా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా 2019 నాటి పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది..’ అని పార్టీ నాయకులే చెబుతున్నారు.
అందుకే చంద్రబాబూ, చిన బాబూ..బహు పరాక్ అని చెబుతున్నారు.
