సన్న బియ్యం పథకం.. దేశ చరిత్రలో ఒక సంచలన పథకం. ఆనాడు రూ. 2కే కిలో బియ్యం ప్రవేశపెట్టిన TDP ఎంత సంచలనం రేపిందో ఇంచుమించు అలాంటి పథకమే ఇది కూడా. అంతేకాదు దొడ్డు బియ్యం సరఫరా చేస్తుండడంతో ప్రతి గ్రామంలోనూ రేషన్ బియ్యం (Ration) మాఫియా సిండికేట్ నడిచేది. వాటికి కూడా చెక్ పెట్టింది రేవంత్ (Revanth reddy) ప్రభుత్వం.

ప్రతినెలా 3.3 కోట్ల మందికి ప్రతినెలా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం (Fine rice) అందించడం సాధారణ విషయం కాదు. అందుకే ఒకే దెబ్బకు మూడు రికార్డులు కొట్టింది.
మొదటిది పేదలకు సన్న బియ్యంతో భోజనం పెట్టడం.
మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదల వర్గాలు పట్టణాల్లో, పల్లెల్లోనూ ఉన్నారు. వారిలో రేషన్ బియ్యం తీసుకునేవారిలో కనీసం 40 శాతం మంది దొడ్డుబియ్యంతోనే తినే పరిస్థితి ఉండేది. ఇక మారుమూల ప్రాంతాల్లో అంటే తండాల్లో, అటవీ ప్రాంతాల్లో, ఆదరణకు నోచుకోని పెద్దవాళ్లు అంటే ముసలి వారికి మాత్రం నూరు శాతం దొడ్డు బియ్యంతో వండిన అన్నం తప్ప వేరే అవకాశమే లేదు. వారికి సన్న బియ్యం ఇచ్చి పుణ్యం కట్టుకుంది రేవంత్ సర్కార్.

రెండోది రేషన్ మాఫియాను అరికట్టడం…
గతంలో రేషన్ బియ్యం అంటేనే దొడ్డుబియ్యం, నాణ్యత లేని బియ్యం అనే పేరుండేది. దీంతో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం తీసుకుని ఆ బియ్యం బయట అమ్మి సన్న బియ్యం కొనేవారు చాలామంది ఉండేవారు. మరికొందరైతే రేషన్ డీలర్ కే ఆ బియ్యం ఇచ్చేవారు. ఆ దందాకు అడ్డుకట్టపడింది. అంటే ప్రభుతం వెచ్చిస్తున్న ప్రతి రూపాయి పేదవాడికి చేరింది.
ఇక మూడోది రైతులకు లాభం.
సన్న బియ్యం సరఫరా చేయాలంటే సన్న బియ్యం ఉత్పత్తి ఉండాలి. ఇందుకు గాను సన్నాలకు క్వింటాల్ కు రూ. 500 చొప్పున బోనస్ ప్రకటించింది రేవంత్ సర్కార్. సగటున ప్రతి సీజన్లో 40 లక్షలకు తక్కువ కాకుండా సన్నాలను సాగు చేస్తున్నారు రైతులు. సగటున ఎకరానికి ప్రతి సీజనల్లో 28 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందనుకున్నా రూ.14వేలు బోనస్ అందుకున్నాడు తెలంగాణ రైతు. అంటే పెట్టుబడిలో నాలుగో వంతు తిరిగి వచ్చేసింది.
ఈ మూడు అంశాలను బట్టే ఒక్క దెబ్బకు రేవంత్ మూడు రికార్డులు సాధించినట్టైంది. కేంద్రం కూడా ఈ పథకాన్ని ప్రశంసించింది. దేశ వ్యాప్తంగా సన్న బియ్యం పథకం అమలు చేస్తామని కూడా చెప్పింది.
ఇదీ ప్రశ్న: ఇదంతా నాణేనికి ఒకవైపే. పేదలకు సన్న బియ్యం సరఫరా చేయడం హర్షించదగిందే. కాని రాష్ట్ర జనాభా (Population)లో 86 శాతం మందికి రేషన్ బియ్యం అందుతుంటే తెలంగాణ (Telangana) ధనిక రాష్ట్రం అవుతుందా లేక 86 శాతం పేదలు నివసిస్తున్న పేద రాష్ట్రం అవుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
