2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ (BRS)కు గట్టి దెబ్బ. ఆ తరవాత 2024లో వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో ఒక్కసీటూ గెలుచుకోలేకపోవడం పార్టీ కేడర్ కు తీవ్ర నిరాశే. ఇక అధికారంలోకి వచ్చిన రేవంత్ (Revanth) సర్కార్ దూకుడు మీద ఉండడంతో బీఆర్ఎస్ (BRS) కేడర్ కు కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. ఈ లోగా కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటై పలువురిని విచారించింది. అయితే కేసీఆర్ (KCR) కు నోటీసులు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు మళ్లీ కేడర్ ఒకేతాటిపైకి వచ్చింది.

అప్పటివరకు సోషల్ మీడియాలోనే ఎక్కువ స్ట్రాంగ్ గా కనిపించిన కేడర్ (party cadre) క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చింది. కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ (Jubilee hills) ఉప ఎన్నికలతోపాటు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో (Municipal elections) ముందే ఓటమిని ఊహించింది కూడా. అయితే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ ఆశించినంత స్థాయిలో మున్సిపాల్టీలను గెలుచుకోలేకపోయింది.

అధికార పార్టీకే మొగ్గు..
ఇదంతా పైకి కనిపించేదే. అయితే పంచాయతీ ఎన్నికల్లో 40 శాతంపైగా బీఆర్ఎస్ కు రావడం అనేది సాధారణ విషయం కాదు. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకే స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు ఉంటుంది. నాటి ఎన్టీఆర్ (NTR) టైంనుంచి కూడా అప్పటి ఉమ్మడి ఏపీ (AP)తోపాటు ఇప్పటి తెలుగు రాష్ట్రాల్లోనూ అదే కొనసాగుతుంది. అధికారపార్టీని గెలిపిస్తే తమ ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ఓటరు (Voter) సహజంగానే అధికార పార్టీవైపు మొగ్గుచూపుతారు. కాని ప్రతిపక్షం ఎన్ని సీట్లు సాధించింది, ఓట్ల శాతం ఎంత అనేది చాలా ముఖ్యమే.

హంగ్ లకు మినహాయింపు
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 37కిపైగా మున్సిపాల్టీల్లో హంగ్ వచ్చింది. అంటే ఏ పార్టీకి కూడా మెజార్టీ రాలేదు. కాబట్టి ఏకపక్ష తీర్పు అని చెప్పే వీల్లేదు. కాని మిగతా మున్సిపాల్టీ బీఆర్ఎస్ కు వచ్చిన 13 మున్సిపాల్టీలు తక్కువేమీ కాదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ గెలుచుకున్న మున్సిపాల్టీల సంఖ్య 4 మాత్రమే. అయినా 2023లో అధికారంలోకి వచ్చింది. కాని బీఆర్ఎస్ మాత్రం ఈ సారి 13 గెలుచుకుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొదలైంది. ఇప్పుడే ఇలా ఉంటే మరో రెండేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ మార్పులు వస్తేనే..
బీఆర్ఎస్ పార్టీ కేడర్ గ్రామీణ స్థాయుల్లోనూ కాంగ్రెస్ తో కొట్లాడుతోంది. పార్టీ ఒకే తాటిపైకి వచ్చింది. అదే సమయంలో కొన్ని అంశాలుకూడా చర్చకు వస్తున్నాయి. పార్టీ నాయకుల్లోనూ అదే చర్చ జరుగుతోంది. అవేంటో చూద్దాం.
-
రేవంత్ సర్కార్ పై ఆధారాలతో సహా విమర్శలు చేయడం
-
నిర్మాణాత్మకమైన పోరాటం, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఒకేసారి జరిగేలా చూడడం
-
పాత సెంటిమెంట్లనుంచి బయటకు రావడం తద్వారా అందరి పార్టీ అనే నమ్మకం పెంచుకోవడం
-
సోషల్ మీడియాలో వచ్చేవాటిపైనే ఆధారపడకుండా పార్టీ పరిశోధనాత్మక అంశాలను బయటకు తీయడం
-
ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేయడం
-
పార్టీలో మండలస్థాయిలో ఉన్న విభేదాలను పరిష్కరించడం
-
అంతిమంగా..కేసీఆర్ ప్రజల్లోకి రావడం
ఈ అంశాలనే పార్టీ నాయకులుకూడా ప్రస్తావిస్తున్నారు. ఈ మార్పులు వస్తే గనుక పార్టీ మరింత వేగంగా పుంజుకుంటుందని చర్చ నడుస్తోంది. మరి బీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.
