కొన్నాళ్ల క్రితం మేఘాలయలో హనీమూన్ పేరుతో జరిగిన రాజా రఘువంశీ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దాదాపు ఇలాంటి సంఘటనే రాజస్థాన్లో జరిగింది. అయితే ఈ సారి ఆ నవ వధువు భర్తతో కలిసి ఈవినింగ్ వాక్ చేస్తూ హత్యకు ప్లాన్ చేసింది.

పెళ్లైన మూడు నెలలకే..
రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ కు చెందిన ఆశిష్-అంజు లకు 3 నెలల క్రితం పెళ్లైంది. తొలినాళ్లలోనే విభేదాలు రావడంతో అంజు తన పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ మనసు మార్చుకుని తిరిగి వచ్చింది. తన భార్య మనసు మార్చుకుని రావడంతో ఆశిష్ ఆమెను అంగీకరించాడు. అత్తమామలు కూడా ఇంట్లోకి రానిచ్చారు.
ఇదీ అంజూ అల్లిన కథ
సీన్ కట్ చేస్తే జనవరి 30న రాత్రి శ్రీ గంగానగర్ లో రోడ్డుపై ఆశిశ్-అంజు పడిపోయి ఉండడంతో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వచ్చి చూసేసరి అంజు స్పృహ తప్పి కనిపించింది. ఇక ఆశిష్ గాయాలతో చనిపోయి కనిపించాడు. అంజును వైద్యులు పరీక్షించి చిన్నపాటి ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఆమె లేచింది. తాము వాకింగ్ చేస్తుంటే కారు ఢీకొట్టి వెళ్లిపోయిందని చెప్పింది. తమ ఒంటిపై నగలుకూడా దోచుకెళ్లారని చెప్పింది. ఏమీ ఎరుగనట్టు అంజూ కోసం ఏడ్వడం మొదలుపెట్టింది. పోలీసులు కూడా తొలుత నమ్మారు. అయితే లోతుగా ఎంక్వైరీ చేస్తే పలు అనుమానాలు వచ్చాయి.
అసలు జరిగింది ఇదీ..
ఆశిశ్ మెడ వద్ద గాయాలు ఉండడం,పలు చోట్ల దెబ్బలు తగిలాయి. అంజుకి మాత్రం చిన్నపాటి గాయం కూడా కాలేదు. నగలను ఎవరో లాగినట్టు ఆనవాళ్లు కూడా లేవు. ఆమె చూపుల్లోనూ తేడా కనిపించింది. దీంతో ఎంక్వైరీ పేరుతో పిలిపించి విచారిస్తే అసలు విషయం చెప్పింది.
పెళ్లికి ముందే అంజుకి సంజు అనే లవర్ ఉన్నారు. సంజుతో పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని భావించి ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఇక కుటుంబ పెద్దలు కూడా పెళ్లి సంబంధాలు చూడడంతో సరేనని చెప్పింది. వారు ఆశిశ్ ను ఎంపికచేశారు. అతను స్థానికంగా గార్మెంట్ వ్యాపారి. అతనితో పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లి కూడా గ్రాండ్ గా చేశారు. అయితే పెళ్లైన వారం రోజులకే పుట్టింటికి చేరిన అంజు, ఆశిశ్ కుటుంబంపై పలు ఆరోపణలు చేసింది. ఆశిశ్ సంసారానికి పనికిరాడని కూడా చెప్పిందట. అయితే తాను చెప్పిన ప్రతిదానికీ తల్లిదండ్రులు తలాడించలేదు. కొన్ని రోజులు వేచి చూస్తే అన్నీ సర్దుకుంటాయని చెప్పి ఒప్పించే యత్నం చేశారు. అది అంజుకి నచ్చలేదు. మళ్లీ ఆశిశ్ తో సంసారం చేసేది లేదని, అయితే అతడు ఉండగా సంజుతో కలిసి ఉండడం కదరని పని అనుకుంది.

ఇదే విషయాన్ని సంజుకి చెప్పడంతో ఇద్దరూ కలిసి మాస్టర్ ప్లాన్ చేశారు. ఆశిశ్ కు రోజూ రాత్రి భోజనం తరవాత వాకింగ్ చేసే అలవాటు ఉంది. అదే అదనుగా మాస్టర్ ప్లాన్ వేసింది అంజు. అంజు గనుక ఆశిశ్ ను చీకటి టైంలో తాము చెప్పిన స్పాట్ కి రప్పిస్తే అడ్డు తొలగించుకోవచ్చని ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ అమలు చేయాలంటే ముందుగా ఆశిశ్ ను తాను నమ్మిచాలని అంజు డిసైడైంది.
అందులో భాగంగా మళ్లీ తాను అత్తగారింటికి చేరింది. ఆశిశ్ తో సంసారం చేసేందుకు ఒప్పుకుంది. ఇక భార్య తిరిగి వచ్చినందుకు సంతోషించాడు ఆశిశ్. ఇదే అదనుగా తాను కూడా ఫిట్ నెస్ కోసం రోజూ వాకింగ్ కు వస్తానని చెప్పి ఆశిశ్ కు తోడుగా వెళ్లింది. ఆశిశ్ ఫిజికల్ ఫిట్ నెస్ ఏంటో చూసింది. ఆశిశ్ కు కొద్దిపాటి మార్షల్ ఆర్ట్స్ కూడా వచ్చు. దీంతో సంజు ఒక్కడు ఆశిశ్ ను చంపలేడని, ఇద్దరు ముగ్గురు అవసరమని భావించింది. ఇదే విషయం సంజుకి చెప్పడంతో అతను తాను మనుషుల్ని తీసుకొస్తానని చెప్పాడు. అందరూ కలిసి ప్లాన్ చేశారు.
ఇక జనవరి 30 రాత్రి ఆశిశ్ తో వాకింగ్ కి బయలు దేరింది. వారు రోజూ చేసే మార్గంలో కొన్ని పొదలు ఉంటాయి. అక్కడికి రాగానే పొదల మాటునుంచి సంజు, అతని అనుచరులు రాకీ అలియాస్ రోహిత్, బాదల్ అలియాస్ సిద్ధార్థ్ వచ్చి ఆశిశ్ పై దాడి చేశారు. ఆశిశ్ ప్రతిఘటించడంతో గొంతుకు తాడు బిగించి చంపారు. ఈ దాడి జరుగుతున్నప్పుడు అంజు పక్కనే ఉండి చూస్తూ నవ్వుతూ నిలబడింది.
ఆశిశ్ చనిపోయాక మహానటి అవతారం
ఇక ఆశిశ్ చనిపోయినట్టు కన్ ఫర్మ్ అయ్యాక ఆ బాడీనీ రోడ్డు పక్కకు తెచ్చి ఆ నలుగురు వెళ్లిపోయారు. అంజు కూడా స్పృహ తప్పి పడిపోయినట్టు నటించింది. పోలీసులు వచ్చాక లేచింది. ఎవరో తన భర్తను కొట్టి తన ఒంటి పై ఉన్న నగలు లాక్కుపోయారని ఏడుపు మొదలుపెట్టింది. ఆమె నటనకు పోలీసులు కూడా కాసేపు మాయపడ్డారు.

అయితే అంజు చెప్పిన చోట హిట్ అండ్ రన్ ఆనవాళ్లు లేకపోవడం, ఆ మార్గంలో కార్లు వెళ్లినట్టు దూరంగా ఉన్న సీసీ కెమెరాల్లోనూ కనిపించకపోవడంతో అనుమానాలు వచ్చాయి. దీంతో తమదైన శైలిలో విచారిస్తే అంజు అసలు విషయం చెప్పింది. ఇక గంగానగర్ పోలీస్ సూపరింటెండెంట్ అమృత దుహాన్ చేసిన సాంకేతిక దర్యాప్తు పూర్తిచేసి.. ఇది హత్యగా వెల్లడించారు.
మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. నగల కోసమే ఈ హత్య జరిగినట్టు నమ్మించాలనే ఉద్దేశంతో..ఆశిశ్ ను చంపేశాక స్వయంగా అంజునే తన చెవి దిద్దులు, మెడలోని నగలు, ఫోన్ తీసి సంజుకి ఇచ్చేసింది.
ఇక నేరం చేసి దొరికిపోవడంతో ప్రస్తుతం అంజు, సంజుతోపాటు మిగతావారిద్దరూ కూడా కటకటాల వెనక్కి వెళ్లారు. ఏ పాపం తెలియని పాతికేళ్ల ఆశిశ్ ను కోల్పోయిన కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
