March 1, 2026

మున్సిపల్ ఎన్నికలే రేవంత్ కి అసలైన పరీక్ష

మరో వారం రోజుల్లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల గెలుపు స్ఫూర్తితో సమష్టిగా పని చేయాలని సీఎం రేవంత్ ఇప్పటికే పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేశారు.  ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల ప్రచార సభల్లోనూ పాల్గొననున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అసలైన పరీక్ష గా మారనున్నాయి.

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు ఎక్కువ మంది గెలిచినట్లు కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. సీఎం రేవంత్ కూడా దాదాపు 60 శాతం పంచాయతీలు కైవసం చేసుకున్నామని చెప్పారు. సాధారణంగానే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీవైపే ఓటర్లు మొగ్గుతారు. అధికార పార్టీ ని గెలిపిస్తే గ్రామం అభివృద్ధి  చెందుతుందనే అభిప్రాయం ఉండడం ఒక కారణం. అంతేకాకుండా ఇతరత్రా పాలనాపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు గ్రామాల్లో అధికార పార్టీవైపు ఎక్కువగా మొగ్గుచూపుతారు.

ఇక పార్టీల సిబల్స్ లేకుండా జరిగే ఎన్నికలు కాబట్టి తటస్థులు గెలిచినా, వైరి పక్షాలు గెలిచి తమ పార్టీలోకి వచ్చినా అది అధికార పార్టీ ఖాతాలోకే వెళ్తుంది. అయినప్పటికీ 40 శాతం సీట్లు వైరి పక్షాలు గెలిచాయంటే సాధారణ విషయం కాదు.

బీఆర్ఎస్ సమాయత్తం

ఇక పంచాయతీ ఎన్నికల్లో తాము 44 శాతం పంచాయతీలు గెలుచుకున్నామని, మరో 100 పంచాయతీల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేసిందని బీఆర్ఎస్ చెబుతోంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఈ సారి ఆ అవకాశం ఇవ్వకుండా ముందుగానే సమాయత్తం అయింది. డివిజన్ల స్థాయిలో మీటింగ్ లూ పెట్టింది.

అసలైన పరీక్ష

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకుండా జరుగుతాయి కాబట్టి ఆ ఎన్నికల్లో గెలుపునకు సంబంధించి ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. కాని మున్సిపల్ ఎన్నికల్లో అలా కుదరదు. పార్టీ గుర్తుపై  జరగుతాయి. ఏ పార్టీ ఎన్ని డివిజన్లు గెలిచిందో కచ్చితమైన డేటా బయటకు వస్తుంది. ఈ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలతో పోల్చితే ఎక్కువ శాతం గెలిస్తే రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఉండదు. కాని అంతకంటే తక్కువ వస్తే..అంటే 60 శాతం కంటే తక్కువ వస్తే రేవంత్ ప్రభుత్వానికి పరీక్ష లాంటింది. అందుకే సీఎం రేవంత్ గతంలో ఎన్నడూ లేని రీతిలో మున్సిపల్ ఎన్నికలకు దాదాపు వారం పాటు పలు చోట్ల బహిరంగ సభలు పెడుతున్నారు.

ఫిబ్రవరి 13న తేలనున్న భవితవ్యం

తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2,996 వార్డులకు ఫిబ్రవరి 11న ఎన్నికలు  జరగనున్నాయి. దాదాపు 53. 43 లక్షల మంది ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోనున్నారు. ఫలితాలు ఫిబ్రవరి 13న వస్తాయి. ఫలితాలు ఎలా వస్తాయనే అంశాన్ని బట్టి రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది.

మరో ముఖ్యమైన అంశం ఏంటంటే..ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఢీ అంటే ఢీ అంటుంది. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి అధికార కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు వస్తే మాత్రం బీఆర్ఎస్ మరింత దూకుడుగా వెళ్తుంది. ఒక వేళ 40 శాతం కంటే తక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకి కొత్తగా  వచ్చే నష్టం ఏమీ లేదు.

అయితే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు బీఆర్ఎస్ కు కొంత సానుకూలంగా ఉండడం ఆలోచించాల్సిన అంశమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *